పాపకు న్యాయం జరిగింది – సెలబ్రిటీల ట్విట్లు

సైదాబాద్‌ చిన్నారి హత్యాచార ఘటన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. స్టేషన్‌ ఘన్‌పూర్‌ సమీపంలోని నష్కల్‌ రైల్వే ట్రాక్‌పై రాజు మృతదేహాన్ని గుర్తించారు. రాజు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలిసి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.  పాపకు న్యాయం జరిగిందంటూ ట్వీట్లు చేశారు.

‘చిన్నారిపై హత్యాచారం చేసిన మృగం చనిపోయింది’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రైల్వే ట్రాక్‌పై మృతదేహం గుర్తించినట్లు డీజీపీ చెప్పారని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి : అభంశుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కిరాతకుడు రాజు తనకు తానే శిక్షించుకోవడం బాధిత కుటుంబంతో సహా అందరికీ కొంత ఊరట కలిగిస్తుంది. ఈ సంఘటనపై మీడియా, పౌర సమాజం గొప్పగా స్పందించాయి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వంతో పాటు, పౌర సమాజం చొరవ చూపాలి. అటువంటి కార్యక్రమం ఎవరు చేపట్టినా వారికి నా సహకారం ఉంటుంది. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలి” అని చిరు ట్వీట్‌ చేశారు.

మంత్రి కేటీఆర్ ట్వీట్‌ను మంచు మనోజ్‌ రీట్వీట్‌ చేస్తూ ‘సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు సర్‌.. దేవుడు ఉన్నాడు’ అని పేర్కొన్నారు.

‘కోర్టుల్లేవు.. విచారణల్లేవు.. మానవ హక్కుల సంఘాల్లేవు…పేజీలకు పేజీల ఆరాల్లేవు.. ఎదురు చూసే పనులు అస్సల్లేవు.. చిట్టి తల్లి కన్న తల్లిదండ్రుల బాధకి కాస్త ఊరట కలిగిస్తూ, వారు కోరుకున్న న్యాయం జరిగిందని ఆశిస్తూ..’ అంటూ యువ హీరో సందీప్ కిషన్ ట్విట్ చేశారు.

“చిన్నారి ఆత్మకు శాంతి చేకూరిందని భావిస్తున్నా. చిన్నారి ఆత్మఘోష రాజు మృతికి దారి తీసింది. హత్యాచార ఘటనలు అత్యంత బాధాకరం. బాలికల్లో అవగాహన కోసం కార్యక్రమాలు చేపడతాం” అని మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.

“చట్టం నుంచి తప్పించుకోవచ్చేమో గానీ ఆ దైవం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు.. అభంశుభం తెలియని ఆ పసికందును అతి కిరాతకంగా హత్య చేసిన ఆ నరరూప రాక్షసుడికి దైవం సరైన శిక్ష విధించింది… పాప ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం” అని రఫీక్‌ అనే నెటిజన్ ట్విట్ చేశారు.