హైదరాబాద్‌లో మరో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు

తెలంగాణ కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

వైద్యారోగ్య శాఖపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. వచ్చే ఏడాది నుంచి కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి ఆమోదం తెలిపింది. ఇందుకోసం కావాల్సిన ఏర్పాటు చేసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులను మంత్రివర్గం ఆదేశించింది. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధి కొరకు సమగ్రమైన ప్రణాళికలను సిద్ధం చేసుకుని తదుపరి కేబినెట్ ముందుకు తీసుకురావాలని మంత్రి మండలి వైద్య శాఖాధికారులను ఆదేశించింది.

కరోనా పూర్తిగా అదుపులోనే ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.56 కోట్లకుపైగా కొవిడ్‌ టీకా డోసులు పంపిణీ చేసినట్లు చెప్పారు. నేటి నుంచి స్పెషల్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపట్టినట్లు వివరించారు. ఒకవేళ చిన్న పిల్లలకు కరోనా వస్తే పరిస్థితులను ఎదర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, 133 కోట్ల ఖర్చుతో 5200 బెడ్స్, మందులు, ఇతర సామాగ్రిని, చిన్నపిల్లల వైద్యానికి ముందస్తుగా ఇప్పటికే సమకూర్చుకున్నామని వైద్యాధికారులు కేబినెట్ కు వివరించారు.