పొలిటికల్ ఎంట్రీపై నితిన్ క్లారిటీ
యంగ్ హీరో నితిన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం లేదు. కానీ రాజకీయ నేపథ్యంలో సినిమాలు చేయబోతున్నాడనే ప్రచారం జరిగింది. పవర్ పేట, మాచర్ల నియోజవర్గంలో సినిమాలు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్నాయని ఆయన అభిమానులు చెప్పుకున్నారు. మాస్ట్రో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నితిన్ ఈ రెండు సినిమాలపై క్లారిటీ ఇచ్చాడు.
‘సినిమా కథ మొత్తం మాచర్ల చుట్టూ తిరుగుతుంది. పొలిటికల్ బేస్డ్ మూవీ కాబట్టి నియోజకవర్గం అనే పదం యాడ్ చేశాం. సినిమాలో ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రి పాత్రలు ఉంటాయి. ప్రస్తుత రాజకీయాలకు, గతంలో జరిగిన పాలిటిక్స్ కు మా సినిమాతో సంబంధం ఉండదు. ఇది పూర్తిగా సినిమాటిక్ ఫిక్షన్ స్టోరీ. పవర్ పేట సినిమా కూడా పొలిటికల్ స్టోరీనే. కానీ దాన్ని ఆపేశాను. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల వదిలేయాల్సి వచ్చింది’ అని నితిన్ వివరించాడు.
‘మాచర్ల నియోజకవర్గంలో’ చిత్రానికి శేఖర్ దర్శకత్వం వహించనున్నాడు. నితిన్ కి జంటగా కృతి శెట్టిని తీసుకున్నారు. ఇందులో సెకెండ్ హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను సెలక్ట్ చేశారు. ఇప్పటికే సినిమాని లాంచ్ చేశారు. త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఇక ఓటీటీ వేదికగా నితిన్ తాజా చిత్రం మాస్ట్రో హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంధూదన్ కి ఫర్ ఫెక్ట్ తెలుగు రిమేక్ అని కితాబిస్తున్నారు.