ఐటీ దాడులపై సోనూసూద్ స్పందన
నటుడు సోనూసూద్ నివాసాల్లో నాలుగు రోజులపాటు ఐటీ దాడుల జరిగిన సంగతి తెలిసిందే. పన్ను ఎగవేత ఆరోపణలతో సోనూసూద్ ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. ఈ క్రమంలోనే సోనూ రూ.20కోట్లకు పైగా పన్ను ఎగవేశారని ఐటీ శాఖ ఓ ప్రకటన చేసింది. మొదటి వేవ్ సమయంలో ఆయన ఏర్పాటు చేసిన దాతృత్వ సంస్థ రూ.18 కోట్లకు పైగా విరాళాలను సేకరించిందని తెలిపిన అధికారులు.. అందులో రూ.1.9 కోట్లు మాత్రమే సహాయ కార్యక్రమాలకు వినియోగించారని, మిగతా డబ్బు ఆ సంస్థ ఖాతాలోనే ఉండిపోయిందని తెలిపారు.
ఐటీ దాడులపై సోనూసూద్ తొలిసారి స్పందించారు. “ఏ విషయంలోనైనా ప్రతిసారీ నువ్వు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది. మంచి మనస్సుతో భారతదేశ ప్రజలందరికీ నా వంతు సాయం చేయాలని ప్రతిజ్ఞ చేసుకున్నాను. సాయం కోసం చూసే ప్రజలతోపాటు ఒక విలువైన ప్రాణాన్ని కాపాడటం కోసమే నా సంస్థలోని ప్రతి రూపాయీ ఎదురుచూస్తోంది. నేను ప్రచారకర్తగా వ్యవహరించినందుకుగాను వచ్చే పారితోషికాన్ని మానవసేవ కోసం వినియోగించాలని ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఆయా బ్రాండ్ సంస్థలకు సూచించాను. అలా, మా ప్రయాణం కొనసాగుతోంది. గడిచిన నాలుగు రోజుల నుంచి వ్యక్తిగత పనుల్లో (ఐటీ దాడులు) బిజీగా ఉండటం చేత మీకు అందుబాటులో లేను. మళ్లీ సేవలందించేందుకు ఇప్పుడు మీ ముందుకు వచ్చేశాను” అని సోనూ ట్వీట్ చేశారు.