అందుకే టీచర్ల బదిలీకి వెబ్ కౌన్సిలింగ్…!!
ప్రతి ఉపాధ్యాయుడికి వారి అర్హతల మేరకు న్యాయం జరిగేందుకు, బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం వెబ్ కౌన్సిలింగ్ చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్ టీచర్ల బదిలీలను వెబ్ కౌన్సిలింగ్ లో చేయాలని చెప్పారని, ఉపాధ్యాయ జేఏసీలు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలను అంగీకరించిన మేరకే ఈ విధానం అమలు చేస్తున్నామన్నారు. వెబ్ కౌన్సిలింగ్ లో లోపాలున్నాయని, ఈ విధానం వద్దని గత కొద్ది రోజులుగా ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు.
సిఎం కేసిఆర్ ప్రకటన తర్వాత రెండుసార్లు మే నెల 21, జూన్ 2న ఉపాధ్యాయ జేఏసీలతో సమావేశం నిర్వహించామని, ఈ సమావేశాల్లో ఉపాధ్యాయ సంఘాలు వెబ్ కౌన్సిలింగ్ కు అంగీకరించాయని, దీంతో పాటు పదోన్నతులు కూడా చేపట్టాలని విజ్ణప్తి చేసాయని ఆయన తెలిపారు. ఉపాధ్యాయ జేఏసీలు చెప్పినట్లుగానే వేర్వేరుగా ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్.జీ.టీలకు బదిలీలు నిర్వహిస్తున్నామని, ఈ ప్రక్రియలో ఇంత దూరం వచ్చాక ఇప్పుడు వెబ్ కౌన్సిలింగ్ వద్దని కొంతమంది ఉపాధ్యాయ సంఘాలు అనడం సమంజసం కాదన్నారు. కొంతమంది వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించవద్దని కోర్టుకు వెళ్తున్నారని ఆయన అన్నారు.
జూన్ 24వ తేదీ నుంచి స్కూల్ అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియ ప్రారంభమైందని, ఇందులో 31,961 మంది దరఖాస్తు చేసుకుంటే 27,750 మంది కౌన్సిలింగ్ లో పాల్గొన్నారని మంత్రి చెప్పారు. అయితే వెబ్ కౌన్సిలింగ్ లో ఇచ్చిన ఆప్షన్లు మారుతున్నాయని, కొంతమంది యూనియన్ నేతలు ప్రచారం చేయడం వల్ల చాలామంది గందరగోళానికి గురవుతున్నారని ఆయన తెలిపారు. దీనివల్ల ప్రధానోపాధ్యాయులు కూడా తమ ఆప్షన్లు ఏమైనా మారాయా? అనే అనుమానంతో మళ్లీ వెబ్ సైట్ కు లాగిన్ కావడం వల్ల సర్వర్లు డౌన్ అయ్యాయని అన్నారు. ప్రభుత్వానికి సహకరించాల్సిన వాళ్లు, బాధ్యతగా ఉండాల్సిన వాళ్లే ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.