ఘోర ఓటమిపై కోహ్లీ ఏమన్నాడంటే ?
ఐపీఎల్-14 రెండో పార్టుని ఆర్సీబీ పేలవంగా ఆరంభించింది. కోల్‌కతా చేతిలో చిత్తుగా ఓడింది. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (3/13).. పేసర్లు ఆండ్రి రసెల్ (3/9), లోకీ ఫెర్గూసన్ (2/24) విజృంభించడంతో బెంగళూరు 19 ఓవర్లలో కేవలం 92 పరుగులకే కుప్పకూలింది. 22 పరుగులు చేసిన ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కలే టాప్‌స్కోరర్. అనంతరం ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (48; 34 బంతుల్లో 6×4, 1×6), వెంకటేశ్ అయ్యర్ (41 నాటౌట్; 27 బంతుల్లో 7×4, 1×6) చెలరేగి ఆడటంతో కోల్‌కతా 10 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇది తమకు మేలుకొలుపు లాంటిదని, ఈ ఓటమితో మున్ముందు ఏయే విషయాలపై దృష్టిసారించాలో తెలిసొచ్చిందని చెప్పాడు.తొలుత బ్యాటింగ్ చేస్తే బాగుంటుందని అనిపించింది. ఈ క్రమంలోనే బ్యాటింగ్ ఎంచుకున్నాం. అలాగే 40 పరుగుల దాకా మేం ఒక్క వికెటే కోల్పోయాం. ఆ తర్వాత 20 పరుగుల్లోనే ఐదు వికెట్లు పోగొట్టుకున్నాం. ఇక అక్కడి నుంచి కోలుకునే ప్రసక్తే లేకపోయింది. ఇది మాకు మేలు కొలుపు లాంటిది. రెండో దశలో ఆదిలోనే ఇలా జరగడం వల్ల మున్ముందు ఏయే విషయాలపై దృష్టిసారించాలో తెలిసొచ్చిందని విరాట్ అన్నారు.