కరోనా టెస్టులు.. హైకోర్టు కీలక ఆదేశాలు !
కరోనా నియంత్రణ, వాక్సినేషన్ కు సంబంధించి తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. రానున్న దసరా, దీపావళి, క్రిస్మస్ పండగలను దృష్టిలో ఉంచుకుని కొవిడ్ పరీక్షలను పెంచాలని, అందులోనూ ఎక్కువ శాతం ఆర్టీపీసీఆర్ ఉండేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పాఠశాలలు ప్రారంభమైనందున పిల్లల ద్వారా కరోనా లక్షణాలు ఇళ్లలోని పెద్దలకు వ్యాపించే అవకాశం ఉందని.. బోధన, బోధనేతర సిబ్బంది అందరికీ టీకాలు వేయడం రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. అంతేకాదు.. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ‘కలర్ గ్రేడెడ్ యాక్షన్ ప్లాన్’ (ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక)ను ఈ నెల 30లోగా సమర్పించాలని ఆదేశించింది. కొవిడ్‌పై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పై ఆదేశాలు జారీ చేసింది.