ఇది ధోని మార్క్ గెలుపు
మ్యాచ్‌ను పేలవంగా ఆరంభించినా, మధ్యలో గొప్పగా పుంజుకున్న చెన్నై.. బెంగళూరుని ఈజీగా ఓడించేసింది. మొదట బెంగళూరు 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. పడిక్కల్ (70; 50 బంతుల్లో 5×4, 3×6), కోహ్లి (53; 41 బంతుల్లో 6×4, 1×6) రాణించారు. ఓ మోస్తారు టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్నందుకుంది. రుతురాజ్ గైక్వాడ్ (38; 26 బంతుల్లో 4×1, 1×6), అంబటి రాయుడు (32; 22 బంతుల్లో 3×4, 1×6), డుప్లెసిస్ (31; 26 బంతుల్లో 2×4, 2×6) సత్తా చాటారు.
111/0.. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 13 ఓవర్లకు చేసిన స్కోరిది. ఓపెనర్లు కోహ్లి, పడిక్కల్ అర్ధశతకాలు సాధించి జోరుమీదున్నారు. ఇంకా డివిలియర్స్, మ్యాక్స్‌వెల్ ఆడాల్సి ఉంది. ఆర్‌సీబీ 200 దాటడం, మ్యాచ్ గెలవడం లాంఛనమే అన్న అభిప్రాయానికి వచ్చేశారు అభిమానులు. కానీ అనూహ్యం.. చివరికి బెంగళూరు చేసింది 156 పరుగులే. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో అనూహ్యంగా పుంజుకున్న చెన్నై.. కూల్ గా గెలిచేసింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో తిరిగి అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్‌కు చేరువైంది.