మోడీ చమత్కారం.. బైడన్ నవ్వులు !
శుక్రవారం ఉదయం శ్వేతసౌధానికి చేరుకున్న భారత ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు నేతలు పలు కీలక అంశాలపై చర్చించుకున్నారు. బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇద్దరు నేతలు ముఖాముఖీ కలుసుకోవడం ఇదే ప్రథమం. అయితే మోడీ, జో బైడెన్ ల మధ్య ఓ సరదాగా సంభాషణ జరిగింది.
1972లో సెనెటర్‌గా తాను తొలిసారి ఎన్నికైనప్పుడు ముంబయి నుంచి ఓ వ్యక్తి లేఖ రాస్తూ.. తన ఇంటి పేరు బైడెన్ అని పేర్కొన్నారని గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యక్షుడి హోదాలో ముంబయి వచ్చినప్పుడు కొందరు విలేకరులు ఇదే విషయంపై తనను అడిగారని చెబుతూ.. ఆ మరుసటి రోజే భారత్‌లో అయిదుగురు బైడెన్లు ఉన్నారని పత్రికలు రాశాయని తెలిపారు. అయితే, వారి గురించి తానెపుడూ ఆరా తీయలేదన్నారు. బహుశా ఇవాళ్టి సమావేశం అందుకు ఏమైనా ఉపయోగపడుతుందేమోనంటూ చమత్కరించారు. దీనికి సంబంధించి తాను కొన్ని పత్రాలను తీసుకొచ్చినట్లు తెలిపిన భారత ప్రధాని మోదీ… ‘వారు మీ బంధువులే’ అని తెలిపినప్పుడు హాలులో నవ్వులు విరిశాయి.