కొనసాగుతున్న భారత్ బంద్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు భారత్ బంద్ కొనసాగుతోంది. ఈ బంద్‌లో వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు పాల్గొంటున్నాయి. కాంగ్రెస్, వామపక్షాలు, ఎస్పీ, బీఎస్పీ, ఆమ్ఆద్మీ, తెదేపాతో పాటు పలు రైతు సంఘాలు బంద్‌కు మద్దతు తెలిపాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఏపీ ప్రభుత్వం భారత్ బంద్‌కు సంఘీభావం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం బంద్ కు దూరంగా ఉంటోంది.అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారత్ బంద్ ప్రభావం కనిపిస్తోంది. మధ్యాహ్నం వరకు బస్సులు నిలిపివేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం తెలిపింది. మరోవైపు ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు పాఠశాలలకూ సెలవు ప్రకటించారు. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హనుమకొండలో వామపక్షాల నేతలు బస్సులను అడ్డుకున్నారు. దీంతో వామపక్ష నేతలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ బస్టాండ్ వద్ద కాంగ్రెస్, వామపక్షాల నేతలు నిరసన తెలిపారు. బస్టాండ్ ఎదుట బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.సాయంత్రం 4 గంటల వరకు భారత్ బంద్ కొనసాగనుంది.