పవన్ స్పీచ్.. పోసాని అభ్యంతరం !
‘రిపబ్లిక్’ ప్రీరిలీజ్ వేడుక వేదికగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ కు ఏపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఏకీ పారేశారు. పవన్ వ్యాఖ్యల పట్ల పలువురు మంత్రులు, వైకాపా నాయకులు కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం పోసాని విలేకరులతో మాట్లాడారు. పవన్ స్పీచ్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వంలో అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్నాయని పవన్‌క ప్రశ్నిస్తే తప్పు లేదు. కానీ అందుకు సాక్ష్యాలు చూపించాలి.
చిరంజీవిగారు పార్టీ పెట్టినప్పుడు ప్రతిపక్ష నాయకులను అసభ్య పదజాలంతో అవమానించడం మీరు ఎప్పుడైనా చూశారా? మీరు ఎవరిని ప్రేరణగా తీసుకుని దూషిస్తున్నారు? అని పోసాని ప్రశ్నించారు. సాయిధరమ్‌తేజ్ ప్రమాదంలో గాయపడటంతో పవన్ ‘రిపబ్లిక్’ ప్రీరిలీజ్ వేడుకకు వచ్చారు. దురదృష్టవశాత్తూ తేజుకు రోడ్డు ప్రమాదం జరిగింది. త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిద్దాం. ప్రీరిలీజ్ వేడుకకు వచ్చి సాయిధరమ్ తేజ్ గురించి మాట్లాడాలి. అతడు మంచి వాడని, మంచి పనులు చేస్తున్నాడని చెప్పాలి. మేనమామ చిరంజీవి పోలికలు వచ్చాయి.. ఇంకా పైకి రావాలని కోరుకోవాలి.
కానీ, ఆ వేడుకలో సీఎం జగన్‌ను, మంత్రులు, ఎమ్మెల్యేలను నోటికొచ్చినట్లు మాట్లాడారు. తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. మంత్రులను తిట్టడం సరికాదు. పవన్ వాడిన భాష అభ్యంతరకరంగా ఉందన్నారు పోసాని. జగన్ ప్రత్యేకంగా పులివెందులకు వెళ్లకపోయినా ఆయన గెలుస్తారు. అలా ఎవరైనా గెలవగలరా? పవన్ మీరు రెండు నియోజకవర్గాల్లో నిలబడ్డారు? ఒకదానిలోనైనా గెలిచారా? నిజాయతీకి గెలుపు కొలమానం కాదని అనుకుందాం. మీ గొప్పతనం ప్రజలు గుర్తించలేకపోతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు తప్పు చేస్తే పోలీసు కేసులు పెడదామని పోసాని అన్నారు.