పోలీసులకు హెచ్చరిక : పార్టీలతో అంట కాగినవారు జైలుకు వెళ్లాల్సిందే
అధికారంలో ఉన్న రాజకీయ నాయకులకు పోలీసులు కొమ్ముకాయడం, కుమ్మక్కవడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అధికారంలో ఉన్న పార్టీతో సన్నిహితంగా మెలిగి డబ్బులు గుంజుకొనే పోలీసు అధికారులు ప్రభుత్వం మారినప్పుడు తప్పనిసరిగా తిరిగి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పింది. అలాంటి పోలీసులను ఎందుకు రక్షించాలని ప్రశ్నించింది. వారు జైలుకు వెళ్లాల్సిందేనని పేర్కొంది.
లంచాలు తీసుకున్నారన్న ఆరోపణపై ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి గుర్జీందర్ పాల్ సింగ్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న కేసుతో పాటు, రాజద్రోహం అభియోగాన్ని కూడా మోపింది. ఈ కేసుల్లో తనను అరెస్టు చేయకుండా రక్షించాలని కోరుతూ ఆయన చేసిన విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆయనను ప్రస్తుతం అరెస్టు చేయకూడదంటూ తాత్కాలిక రక్షణ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఇలాంటి అధికారుల ప్రవర్తనపై కీలక వ్యాఖ్యలు చేసింది.
ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్నారు కాబట్టి మీరు డబ్బును గుంజుకోగలిగారు. అయితే ఏదో ఒక రోజున దీన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇది మరీ దారుణం. ఇలాంటి అధికారులను ఎందుకు రక్షించాలి? దేశంలో ఇదో కొత్త ధోరణి ప్రబలుతోందని జస్టిస్ రమణ అన్నారు.