గులాబ్ తుఫాన్.. మృతులకు రూ.5లక్షల పరిహారం !

గులాబ్ తుఫాన్ తో ఏపీ వణికిపోయింది. ప్రాణ నష్టం తగ్గించేందుకు జగన్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. అంతేకాదు.. గులాబ్‌ తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం జగన్ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావంతో మరణించిన వారి కుటుంబాలకు వెంటనే రూ.5లక్షల చొప్పున పరిహారమివ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. సహాయ శిబిరాలనుంచి బాధితులు వారి ఇళ్లకు వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ.వెయ్యి చొప్పున ఆర్థికసాయం చేయాలని సూచించారు.

బాధిత కుటుంబాలకు ఉదారంగా సాయం చేయాలని చెప్పారు. అవసరమైనచోట సహాయ శిబిరాలు ఏర్పాటుచేయాలని, వాటిల్లో ఉండేవారికి నాణ్యమైన ఆహారం అందివ్వాలని సూచించారు. అందరికీ వైద్యం, రక్షిత తాగునీరు అందించాలని పేర్కొన్నారు. అవసరమైనచోట వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలన్నారు. వర్షం తగ్గుముఖం పట్టిన వెంటనే విద్యుత్తు సరఫరా పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.