ఆత్మరక్షణలో కాంగ్రెస్.. ప్రయోగాలకు నో !
పంజాబ్ వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడింది. పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి అమరీందర్ సింగ్ రాజీనామాతో కాంగ్రెస్లో తీవ్ర దుమారం చెలరేగింది. పంజాబ్ కాంగ్రెస్లో తలెత్తిన వివాదంతో.. ‘జి-23’ నేతలకు కొత్త ఆయుధం లభించినట్లయింది. ఈ వర్గంలోని సీనియర్ నేత కపిల్ సిబల్.. పార్టీ అధినాయకత్వంపై మరోసారి తీవ్ర ప్రశ్నలు లేవనెత్తగా.. ఆయన ఇంటి ముందు కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. దీన్ని ‘జి-23’ నేతలు ఖండించిన సంగతి తెలిసిందే.
పంజాబ్ కాంగ్రెస్లో సంక్షోభం, జి-23 నేతల దూకుడుతో గాంధీ కుటుంబం కలతకు గురైంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ప్రయోగాలకు ఇది సమయం కాదని, అలాంటి ప్రతిపాదనలను వాయిదా వేసుకోవాలని సోనియా గాంధీ.. రాహుల్, ప్రియాంకలకు సూచించినట్లు సమాచారం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం.. ఛత్తీస్గఢ్లో భూపేశ్ బఘేల్, టి.ఎస్.సింగ్ దేవ్లు రెండున్నరేళ్ల చొప్పున ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలని రాహుల్ గాంధీ రాజీ సూత్రాన్ని తెచ్చినట్లు దేవ్ అనుచరులు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్లో బఘేల్ రెండున్నరేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నప్పటి నుంచి.. నాయకత్వంలో మార్పు చేపట్టాలని డిమాండ్ చేస్తోంది. రాజస్థాన్లోనూ ఇదే తరహా సాహసోపేత ప్రయోగాన్ని సచిన్ పైలట్ వర్గం కోరుకుంటోంది.