మా ఎన్నికలు : మేనిఫెస్టో ప్రకటించిన సీవీఎల్ నరసింహారావు
మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల నేపథ్యంలో టాలీవుడ్ హీటెక్కింది. మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. తాజా ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్-మంచువిష్ణు ప్రధాన అభ్యర్థులుగా పోటీలో తలపడుతున్నారు. కాగా, ‘మా’ అధ్యక్ష పదవి కోసం నటుడు సీవీఎల్ నరసింహారావు కూడా పోటీ చేస్తున్నారు. తెలంగాణ కోసం ప్రత్యేకంగా మా అసోసియేషన్ ఉండాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. తాజాగా నరసింహారావు తన మేనిఫెస్టోని ప్రకటించారు.
సీవీఎల్ నరసింహారావు మేనిఫెస్టో :
- ఆర్టిస్టులందరికీ అవకాశాలు వచ్చేలా చూడడం. ఈ మేరకు 2011లో తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు కచ్చితంగా అమలు అయ్యేలా చేయడం. ఆ నిర్ణయాలు అమలుచేయడానికి 50 మంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు. ఈ మేరకు ఆ 50 మంది సభ్యుల పేర్లను త్వరలోనే ప్రకటిస్తాను.
- అసోసియేషన్‌లోని ప్రతిసభ్యుడికీ సంవత్సరానికి రూ.3 లక్షలు ఆరోగ్య బీమా ‘మా’ చెల్లిస్తుంది. అది వచ్చే ఏడాది జనవరి నుంచి అన్ని విధాలుగా అమలయ్యేలా చేస్తాం.
- ఫిలింనగర్ కల్చరల్ క్లబ్లో ‘మా’ సభ్యుడికి అసోసియేట్ మెంబర్షిప్ సంపాదించడం.
- వృద్ధ కళాకారులకు ప్రస్తుతం రూ.6 వేలు పింఛను ఇస్తున్నారు. నవంబర్ నుంచి రూ.10 వేలు ఇచ్చేలా చర్యలు.
- 20 ఏళ్ల క్రితం మహిళల కోసం ప్రవేశపెట్టిన ‘ఆసరా’ని పునఃప్రారంభిస్తాం. ఆసరా కమిటీలో ఉండే 13 మంది పేర్లను త్వరలోనే ప్రకటిస్తాను.
- ఎవరైనా ‘మా’ సభ్యుడు ఆకలి భాధలు పడుతుంటే.. కాల్ చేసిన రెండు గంటల్లోనే అతడి ఇంటికి నెల రోజులకు సరిపడా వంట సామగ్రిని పంపిస్తాను.