రూటు మార్చిన కవిత
సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత రూటు మార్చారు. తన దారి ప్రజల దారి, ఇకపై ప్రజల తరుపునే నిలబడతా. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అన్నట్టుగా కవిత వ్యవహార శైలి మారింది. నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో కవిత హుందాగా ఉండేవారు. కేసీఆర్ ప్రభుత్వం గొప్పగా ఉంది. అద్భుతమైన సంక్షేమ పథకాలని అమలు చేస్తుందని హార్డ్ కోర్ టీఆర్ ఎస్ కార్యకర్తగా చెప్పేది. కానీ ఎంపీగా ఓడిపోయి.. ఆర్నేళ్ల పాటు ఖాళీగా ఉన్న తర్వాత స్థానిక ప్రజాప్రతినిధుల కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన కవితలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది.
ఇటీవల శాసనమండలిలో స్థానిక ప్రజాప్రతినిధుల ఇబ్బందులని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక పరిస్థులు ఏం బాగులేవు అంటూ కేసీఆర్ పాలనపై ఒకింత అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. కవితలో మార్పుని చూసి ప్రజలు, తెరాస వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్పు వెనక కవిత లక్ష్యం మంత్రి పదవా? లేక.. ప్రభుత్వ భజన చేస్తే.. వచ్చే ఎన్నికల్లోనూ తనని ప్రజలు ఓడించేలా ఉన్నారనే భయం వలన వచ్చే మార్పా ? అర్థం కావడం లేదు. అయితే కవితలో వచ్చిన మార్పు పట్ల ఆమె అభిమానులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.