‘మా’ చరిత్ర ఇదీ.. !

సిన్మా రాజకీయం హీటెక్కింది. ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ ఒకవైపు, మంచు విష్ణు ప్యానెల్‌ మరోవైపు పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఇరు వర్గాలు హామీలు, ఆరోపణలు, సవాళ్లతో ‘మా’ ఎన్నికలు మరింత వేడెక్కాయి. అక్టోబరు 10న ‘మా’ ఎన్నికలు జరగనున్న వేళ అసలు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఏర్పడటానికి కారణం ఏంటి ? ఎలా ఏర్పాటైంది? దాని లక్ష్యాలేంటి? ఇంతకు ముందు అధ్యక్షులుగా ఎవరు పనిచేశారు? తదితర విషయాలపై ఓ లుక్కేద్దాం.. !

నటీనటులకు సంబంధించిన సమస్యలు, వివాదాల పరిష్కారం, సభ్యుల సంక్షేమం కోసం 1993లో ‘మా’ ఏర్పాటు చేశారు. కేరళ నటీనటులు ఏర్పాటు చేసుకున్న అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్(అమ్మ) తరహాలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్(మా) పేరుతో ఓ అసోసియేషన్ ఉంటే బాగుంటుందని భావించారు. వెంటనే సినీ పెద్దలందరిని కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ‘మా’ని ఏర్పాటు చేశారు. చిరంజీవిని వ్యవస్థాపక అధ్యక్షుడిగా నియమించారు. 
మా’ అసోసియేషన్ ప్రారంభంలో 150 మంది సభ్యులుండేవారు. 

మా అసోసియేషన్‌కు మొదట వ్యవస్థాపక అధ్యక్షుడిగా చిరంజీవి నియమితులు కాగా, ఆ తర్వాత బాధ్యతలను మురళీమోహన్ స్వీకరించారు. ప్రతి రెండేళ్లకోసారి అసోసియేషన్ అధ్యక్షుడ్ని ఎన్నుకునేవారు. ఈ క్రమంలో మోహన్బాబు, నాగార్జున, నాగబాబు ‘మా’ అసోసియేషన్‌కు సేవలందించారు. అత్యధికంగా ఆరుసార్లు మురళీమోహన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. ఆరేళ్లపాటు వరుసగా జరిగిన పోటాపోటీ ఎన్నికల్లో నటులు రాజేంద్రప్రసాద్, శివాజీరాజా, నరేశ్‌ అధ్యక్షులుగా పనిచేశారు.