ఎంపీ క‌విత చెప్పిన చిలుక క‌థ‌…!!

మాట‌ల‌తో మంత్ర‌ముగ్దుల్ని చేయ‌డంలో సీఎం కేసీఆర్ వార‌స‌త్వాన్ని పునికిపుచ్చుకున్నారు ఎంపీ క‌విత‌. ఎక్క‌డికెళ్లినా, ఏ స‌భ‌లో మాట్లాడినా అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా హిత‌బోధ చేసి కార్య‌క‌ర్త‌ల‌ను ఉత్తేజ‌ప‌ర‌చ‌డంలో ఆమెకు ఆమే సాటి. అప్ప‌టిక‌ప్పుడు ఆ సంద‌ర్బానికి త‌గిన‌ట్టు క‌థ‌లు చెప్ప‌డం కేసీఆర్ నుంచి వార‌స‌త్వంగా అందుకున్నారు నిజామాబాద్ ఎంపీ క‌విత‌. నిజామాబాద్ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో కార్య‌క‌ర్త‌ల బాద్య‌త‌ను తెలియ‌జెప్పేలా ఒక చిలుక క‌థ చెప్పార‌ట‌. అదేంటో మీరూ చ‌ద‌వండి..

కృష్ణ అనే వ్య‌క్తి నడుచుకుంటూ వెళుతుంటే మాట్లాడే చిలుక కనిపించిందట. బాగుందని యింటికి తీసుకెళ్లాడు. ఈ లోపు బాజిరెడ్డి అన్న ఫోన్ చేస్తే పని మీద బయటికి వెళ్లి ఇంటికొచ్చే సరికి ఘుమఘుమ వాసన వచ్చిందట. సంతోషంగా కాళ్లు, చేతులు కడుక్కుని పీటమీద కూర్చున్నాడు కృష్ణ‌. అన్నం తింటున్నప్పుడు చిలుక గుర్తొచ్చి చిలుక ఎట్లుందని భార్యను అడిగాడట. ఏ చిలుక ..తింటున్నది అదేగా అని భార్య అన‌డంతో అరే.. అది వట్టి చిలుక కాదు మాట్లాడే చిలుక అన్నాట్ట. నాకేం తెలుసు..అది మాట్లడుతుందని..అయినా చిలకను పంజరం లొంచి పట్టుకున్నప్పుడు మాట్లాడలేదు, మెడను పట్టుకున్నప్పుడూ మాట్లాడలేదు, పరపరా మెడను కోస్తూన్నప్పుడూ మాట్లాడలేదు..అది మాట్లాడుటది అంటే నేనేలా నమ్మేది అని కృష్ణ భార్య అందట. చేయాల్సిన పనులను చేసేసి, చేసిన పనులను చెప్పుకోక పోతే అంద‌రి పరిస్థితి కూడా చిలుక మాదిరిగానే ఉంటదని ఎంపి కవిత చిలుక కథ ను ముగించారు.