చివరివరకూ.. బెంగళూరుతోనే !
సోమవారం రాత్రి జరిగిన కీలక పోరులో కోహ్లీసేన 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ముగిసింది. వచ్చే యేడాది నుంచి కోహ్లీ బెంగళూరు కెప్టెన్ గా కొనసాగడం లేదు. ఈ నేపథ్యంలో అతడు బెంగళూరు జట్టుతోనే ఉంటాడా ? మరో జట్టులోకి వెళ్తాడా ? అనే కన్ఫూజన్ లో ఆర్సీబీ అభిమానులు ఉన్నారు. వారికి కోహ్లీ స్పష్టతనిచ్చారు.
మాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లీ.. ఒకింత భావోద్వేగం చెందాడు. జట్టును గెలిపించేందుకు తన శక్తి మేర కృషి చేశానన్నాడు. ‘జట్టు కోసం ఎంతగానో కృషి చేశా. యువకులు ఎలాంటి బెరుకులేకుండా స్వేచ్ఛగా ఆడేందుకు జట్టులో కొత్త ఒరవడి సృష్టించా. టీమ్ఇండియాలోనూ నేనిలాగే చేశా. ప్రతిసారీ ఈ ఫ్రాంఛైజీ కోసం 120 శాతం కష్టపడ్డా. ఇకపై ఒక ఆటగాడిగా అదే పనిచేస్తా. చివరగా నేనెప్పటికీ ఆర్సీబీలోనే కొనసాగుతా. వేరే జట్టుతో నన్ను ఊహించుకోలేను. మాటల కన్నా నాకు విలువలే గొప్పవి. అందుకు కట్టుబడి ఉంటా. ఐపీఎల్లో నేను ఆడే చివరి రోజు వరకూ ఈ జట్టుతోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
ఇక నరేన్ వలనే తమకు మ్యాచ్ దూరమైందని కోహ్లీ అంగీకరించాడు. కోల్‌కతా ఇన్నింగ్స్‌లో సునీల్ నరైన్ ఆడిన 12వ ఓవరే తమ అవకాశాలను దెబ్బ తీసిందని చెప్పాడు. క్రిస్టియన్ వేసిన ఆ ఓవర్లో నరైన్ మూడు సిక్సులు బాదగా మొత్తం 22 పరుగులొచ్చాయి. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా మోర్గాన్ టీమ్‌కు అనుకూలంగా మారిందని చెప్పాడు.