ద్రవిడ్ ఎంపిక లాంఛనమే
టీమిండియా ప్రధాన కోచ్ పదవిని భర్తీ చేసేందుకు బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. ముగ్గురు సహాయ కోచ్‌ల కోసం కూడా దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేదీ ఆక్టోబరు 26. అయితే ఏదైనా అనూహ్యం జరిగితే తప్ప ఎన్‌సీఏ అధిపతిగా ఉన్న ద్రవిడ్ ప్రధాన కోచ్ కావడం లాంఛనమే. ఐపీఎల్ సందర్భంగా బీసీసీఐ పెద్దలతో జరిగిన చర్చల్లో బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ అంగీకరించాడు. అయితే నిబంధనల ప్రకారం.. బోర్డు దరఖాస్తులు ఆహ్వానించింది.
ప్రస్తుత ప్రధాన కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్‌ల పదవీకాలం టీ20 ప్రపంచకప్‌తో ముగుస్తుంది. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోర్ తిరిగి దరఖాస్తు చేసుకుంటే పొడిగింపు లభించే అవకాశముంది. ఇక బౌలింగ్ కోచ్‌గా.. ద్రవిడ్‌కు సన్నిహితుడైన అండర్-19 కోచ్ పరాస్ మాంబ్రే ఎంపికయ్యే అవకాశముంది. టీమ్‌ఇండియా ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వ్యక్తి కనీసం 30 టెస్టులు లేదా 50 వన్డేలు ఆడి ఉండాలి లేదా ఏదైనా జాతీయ జట్టుకు రెండేళ్లు లేదా ఏదైనా ఐపీఎల్ జట్టుకు మూడేళ్లు కోచ్‌గా పని చేసి ఉండాలి. సహాయ కోచ్‌లు కావాలనుకునే వారికి కనీసం 10 టెస్టులు లేదా 25 వన్డేల అనుభవం ఉండాలి లేదా ఏదైనా ఐపీఎల్/ఏ జట్టుతో మూడేళ్ల పాటు పని చేసి ఉండాలి.