వీటికి సమాధానం కావాలి

టీ20 ప్రపంచకప్ మొదలైపోయింది. ఈ నెల 24న టీమిండియా తొలి మ్యాచ్ లో దాయాది పాకిస్థాన్ తో ఆడనుంది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పుపై స్పష్టత రావాల్సి ఉంది.  రోహిత్‌ శర్మకు ఓపెనింగ్‌ భాగస్వామిగా కేఎల్‌ రాహుల్‌ను పంపిస్తారా? లేదా ఇషాన్‌ కిషాన్‌కు అవకాశమిస్తారా? హార్దిక్‌ పూర్తి కోటా బౌలింగ్‌ చేసి మళ్లీ ఆల్‌రౌండర్‌గా మారతాడా? లేదా స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గానే కొనసాగుతాడా? జడేజాతో పాటు స్పిన్‌ భారాన్ని మోసేదెవరూ? శార్దూల్‌ ఠాకూర్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా?.. ఇలా టీ20 ప్రపంచకప్‌లో ప్రధాన మ్యాచ్‌లకు ముందు టీమ్‌ఇండియాకు సమాధానం దొరకాల్సిన ప్రశ్నలున్నాయి.

ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో పోరుకు ముందు కోహ్లీ సేన రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడుతుంది. తొలి మ్యాచ్‌లో సోమవారం ఇంగ్లాండ్‌తో తలపడనుంది. అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తున్న భారత్‌కు జట్టు కూర్పు ఒక్కటే సమస్యగా మారింది. అందుకు పరిష్కారం కనుక్కునే దిశగా ఈ వార్మప్‌ మ్యాచ్‌లను జట్టు ఎంతమేరకు సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి.