ముంబైలో కరోనా జీరో
దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గుతుంది. ఈ క్రమంలో దేశ ఆర్థికరాజధాని ముంబైలోనూ కరోనా కంట్రోల్ కి వచ్చేస్తోంది. ఆదివారం ముంబయి నగరంలో 367 పాజిటివ్ కేసులు నమోదు కాగా సున్నా కొవిడ్ మరణాలు నమోదయ్యాయి. కొవిడ్ మహమ్మారి వెలుగు చూసిన తర్వాత తొలిసారిగా అక్కడ కొవిడ్ మరణాలు సంభవించకపోవడం (0 మరణాలు) ఇదే తొలిసారి.
దేశవ్యాప్తంగా కొవిడ్ తీవ్రత తగ్గుముఖం పడుతోన్న నేపథ్యంలో ముంబయిలోనూ కాస్త నియంత్రణలోకి వచ్చినట్లు తెలుస్తోంది. దేశంలో కరోనా వైరస్ ధాటికి విలవిలలాడిన ప్రాంతాల్లో మహారాష్ట్ర ముందువరుసలో ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ముంబయి మహానగరం కొవిడ్ ఉద్ధృతికి వణికిపోయింది. సెకండ్ వేవ్ సమయంలో నిత్యం అక్కడ 11వేల కేసులు, వందల కొద్దీ మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు అక్కడ మొత్తం 7లక్షల 50వేల కేసులు నమోదయ్యాయి. వారిలో 16,180 మంది మృత్యువాతపడ్డారు. అయితే, గతకొన్ని రోజులుగా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోన్న ముంబయిలో తాజాగా రోజువారీ మరణాల సంఖ్య 0కి చేరడం ఊరట కలిగించే విషయం. గడిచిన 24గంటల్లో 28,600 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందులో 367 కేసులు (1.27శాతం పాజిటివిటీ రేటు) బయటపడ్డాయి.