నాకు అన్నీ తెలుసు. కానీ చెప్పను అంటోన్న ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. శనివారం ప్రభాస్ పుట్టినరోజు కానుకగా బోలేడు గిఫ్ట్స్ క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్ లెటెస్ట్ చిత్రం ‘రాధేశ్యామ్’ టీజర్ ని విడుదల చేశారు.  వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్‌ పూర్తిస్థాయి లవర్‌బాయ్‌ పాత్ర పోషించారు.

ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే హస్తసాముద్రిక నిపుణుడి(palmist) పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్‌ లుక్‌, డైలాగ్‌లు, హావభావాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ”నువ్వు ఎవరో నాకు తెలుసు. కానీ నీకు చెప్పను. నీ హృదయం ఎప్పుడు ముక్కలవుతుందో నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. నీ ఓటమి నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. నీ చావు నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. నాకు అన్నీ తెలుసు. కానీ నీకు చెప్పను. ఎందుకంటే, చెప్పినా మీ ఆలోచనలకు అందదు. నా పేరు విక్రమాదిత్య. నేను దేవుడిని కాదు. మీలో ఒక్కడిని కూడా కాదు” అంటూ ప్రభాస్‌ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.