ఏడువొద్దు పూరీ.. వీకైపోతాం !

దర్శకుడు పూరి జగన్నాథ్ ఎంత స్ట్రాంగ్ నో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలు చూస్తే సరిపోద్ది. ఆయన హీరోలు డైనమైట్స్. దూసుకుపోవడమే తప్పా.. ఏడవడాలు, తూడవడాలు కనిపించవు. అలాంటి పూరి కన్నీళ్లు పెట్టుకుంటే చూడగలమా ? ఏడుస్తే వీకైపోతాం అని చెప్పే పూరి, వందల కోట్ల రూపాయలు పోగొట్టుకుని.. రోడ్డు మీదపడ్డప్ప్పుడు కూడా ఏడవని పూరి ఏడిస్తే తట్టుకోగలమా ? కానీ శుక్రవారం వరంగల్ లో పూరి కన్నీరు పెట్టుకున్నారు. ఆనంద బాష్పాలు చిందించారు.

 పూరి తనయుడు ఆకాశ్‌ కథానాయకుడిగా నటించిన ‘రొమాంటిక్‌’ చిత్రం మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం వరంగల్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. పూరీ గురించి మాట్లాడుతూ ఆకాశ్‌ ఎమోషనల్‌ అయ్యారు. పూరీ కెరీర్‌ అయిపోయింది’, ‘రొటీన్‌ సినిమాలు చేస్తున్నాడు’.. ఇలాంటి కామెంట్లు చూసి బాధపడ్డాను. అలాంటి కామెంట్లు చేసిన వాళ్లందరికీ ఇప్పుడు ఒక్కటే చెబుతున్నా.. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో మళ్లీ మా నాన్న హిట్‌ కొట్టాడు.

ఆ సినిమా సక్సెస్‌ చూసి నేను కాలర్‌ ఎగరేసుకున్నా. ‘నాన్నా.. నీ కొడుకుగా పుట్టడం నా అదృష్టం. కానీ ఏదో ఒక రోజు నువ్వు గర్వపడేలా చేస్తా. ప్రతి సినిమాలో ప్రాణం పెట్టి నటిస్తా. ఎన్ని సంవత్సరాలైనా సరే.. నేను కష్టపడి నువ్వు కాలర్‌ ఎగరేసుకునేలా చేస్తా” అని ఆకాశ్‌ పూరీ భావోద్వేగంతో మాట్లాడారు. తనయుడి మాటలు విన్న పూరీ పుత్రోత్సాహంతో ఆనందభాష్పాలు పెట్టుకున్నారు. అది చూసిన ఆయన అభిమానులు.. ఏడవొద్దు సార్.. ఏడిస్తే వీకైపోతామని ఆయన ఫిలాసఫినీ ఆయనకే చెబుతున్నారు.