కేసీఆర్ కు ఘోర అవమానం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఢిల్లీలో ఘోర అవమానం ఎదురైనట్టు తెలుస్తోంది. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో తాడో పేడో తేల్చుకుంటానని కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి ఖాళీగా హైదరాబాద్ తిరిగొచ్చారు. ఈ నాలుగు రోజుల్లో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్స్ కోసం సీఎం కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నాలు చేశారట. కానీ ఒక్కరు కూడా కరుణించలేదు. కలుద్దాం రా అని పిలవలేదు. దీంతో చేసేదేమీ లేక కేసీఆర్ హైదరాబాద్ బాట పట్టారు. బుధవారం సాయం తిరిగివచ్చేశారు. ఇది తెలంగాణకు బీజేపీ చేసిన అవమానమని మంత్రి ఎర్రబెల్లి లాంటోళ్లు మండిపడుతున్నరు.
ఎందుకంటే మమతా బెనర్జీ ఢిల్లీకి వచ్చి నరేంద్రమోడీతో సమావేశం అయ్యారు. మమతా బెనర్జీకి అడగగానే సమయం ఇచ్చి కేసీఆర్‌ను మాత్రం దూరం పెట్టే అవకాశాలు లేవు. ఎందుకంటే గతంలో కేసీఆర్ రాజకీయంతా అత్యంత క్లిష్టమైన సమయాల్లోనూ మోడీ, షా అపాయింట్ మెంట్లు తీసుకున్నారు. తెలంగాణలో బీజేపీకి ఇబ్బందికరం అవుతుందని తెలిసినా కేసీఆర్ అడిగారని మోడీ,షా అపాయింట్ మెంట్లు ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు ఎలాంటి రాజకీయ క్లిష్ట పరిస్థితి లేనప్పటికీ అపాయింట్మెంట్లు ఇవ్వకుండా ఉండటానికి అవకాశం లేదు. అయితే తెలంగాణలో బీజేపీ వేగంగా ఎదుగుతుంది. ఇలాంటి సమయంలో కేసీఆర్ ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి ఆయనకు దక్కుతున్న ఆదరణ చూసి.. టీఆర్ఎస్=బీజేపీ ఒక్కటే అనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. అది తెలంగాణ బీజేపీకి ఇబ్బందిగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఈసారి కేసీఆర్ ని కావాలనే ఢిల్లీ పెద్దలు పక్కకు పెట్టారు. పట్టించుకోలేదని సమాచారం.