ఢిల్లీకి వెళ్తే కాంగ్రెస్ నేతలు కాక ఇంకెవరు కనిపిస్తారు..!!
క్రమశిక్షణ గురించి తనకు చెప్పాల్సిన అవసరం లేదని, తాను ఏ పార్టీలో ఉన్న ఓ పద్ధతి ప్రకారం ఉంటానని రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్ అన్నారు. తనపై ఆరోపణలు చేయడం సరైనది కాదని ఆయన అన్నారు. నిజామాబాద్ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన నేపథ్యంలో విభేదాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ముఖ్యమంత్రికి లెటర్ రాయాల్సింది కాదని, తనతో మాట్లాడితే సరిపోయేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. అది ఆయన చేతుల్లోనే ఉందన్నారు.
తన కుమారుడు ఇండిపెండెంట్ అని, ఆయనకు స్వతంత్రంగ నిర్ణయాలు ఉంటాయని, దానికి తాను ఏం చేయగలనని ఆయన ప్రశ్నించారు. తనపై లేఖ రాయాల్సిన అవసరం ఎందుకొచ్చిందో కవితను, ఎమ్మెల్యేలనే అడంగండని సూచించారు. వ్యక్తిగత పనిమీద ఢిల్లీకి వెళ్లానని, అక్కడ తన క్వార్టర్ రిపేరు పనిచూసుకుని వచ్చానన్నారు డీఎస్. ఢిల్లీ వెళ్తే కాంగ్రెస్ నేతలు కాక ఇంకెవరు కనిపిస్తారని ఆయన ప్రశ్నించారు. తాను ఆజాద్ ను కలిశానని చెప్పటం పచ్చి అబద్ధమని అన్నారు. టీఆర్ఎస్ లోకి వచ్చాక తాను రాజకీయ నేతలను కలవడమే మానేశానన్నారు.
సిఎం కార్యాలయం నుంచి పర్సనల్ సెక్రటరీ వేణు తనకు ఫోన్ చేశారని, సీఎం విజయవాడ కనక దుర్గ ఆలయానికి వెళ్తున్నందున వచ్చిన తరువాత చూద్దామని ఆయన చెప్పారని డీఎస్ తెలిపారు. సీఎం కేసిఆర్ ను కలిసి అన్ని విషయాలు చెపుతానని, వాస్తవాలను వివరిస్తానని ఆయన అన్నారు. సీఎం అపాయింట్ మెంట్ తాను కోరింది కాదని, ముఖ్యమంత్రే తనను వచ్చి కలువమన్నారని ఆయన చెప్పారు.