ఇండియాలోకి ఒమిక్రాన్.. రెండు కేసులు నమోదు
కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ భారత్లోకి ప్రవేశించింది. ఈ వేరియంట్ కేసుల్ని మన దేశంలో గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. విదేశాల నుంచి కర్ణాటక వచ్చిన ఇద్దరు పురుషుల్లో ఈ వేరియంట్ బయటపడినట్లు వెల్లడించింది. వీరిలో ఒకరి వయసు 66ఏళ్లు కాగా మరొకరి వయసు 46 ఏళ్లు. అయితే, గోప్యతను దృష్టిలో ఉంచుకొని వారి పేర్లను వెల్లడించడం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. అయితే ఒమిక్రాన్ వెలుగుచూసిన ఇద్దరిలోనూ తీవ్రమైన లక్షణాలేమీ కనిపించలేదని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టంచేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవగాహన, అప్రమత్తత అత్యవసరమన్నారు. మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం మరవొద్దని విజ్ఞప్తి చేశారు.