సిరివెన్నెల ఆసుపత్రి బిల్లు – ఆ ప్రచారం బాధాకరం
సిరివెన్నెల సీతారామశాస్త్రి – తెలుగు పాట కీర్తిని పెంచిన మహానుభావుడు. ఇటీవలే ఆ పాట మూగబోయింది. అనారోగ్యానికి గురైనా శాస్త్రీ.. హాస్పటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆ బాధ నుంచి ఆయన అభిమానులు ఇంకా కోలుకోలేదు. మరోవైపు సిరివెన్నెల ఆసుపత్రి బిల్లు పేరిట.. ఓ బాధాకరమైన ప్రచారం జరుగుతున్నది. సిరివెన్నెల వైద్యానికి అయిన ఖర్చులన్నింటినీ ఏపీ ప్రభుత్వం భరించేలా జగన్ ఆదేశాలిచ్చారు. ఇందుకుగానూ.. సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు సాయి యోగేశ్వర్ ఏపీ ప్రభుత్వానికి… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
సిరివెన్నెల ఆసుపత్రి బిల్లును “గౌరవ సూచికంగా” కడుతున్నామని ఏపీ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తే.. బాగుండేది. అలా కాకుండా “ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని” బిల్లు కడుతున్నామన్న ప్రచారం బాధాకరం. అంతే కాదు ఇది సమాజంలో అనేక విమర్శలకు కూడా తావిస్తుంది. శాస్త్రికి హైదరాబాదులో రెండిళ్లున్నాయి. వాటిలో ఒకదాంట్లో నివాసముంటూ మరొక దానిని కార్యాలయంగా అనుభవించారు. అది కూడా శ్రీనగర్ కాలనీలో చాలామంది సెలబ్రిటీల ఇళ్ల నడుమ ప్రైం లొకేషన్ లో ఉన్నాయి. శాస్త్రిగారి కొడుకులిద్దరూ కోట్లు సంపాదించే వ్యక్తులు కాకపోయినా వారికంటూ స్వయం ప్రతిభలు ఉన్నాయి. పెద్ద కుమారుడు సంగీతజ్ఞుడైతే, రెండవ కుమారుడు నటుడు. అలాంటప్పుడు సిరివెన్నెల ఆర్థికపరిస్థితిని దృష్టిలో ఉంచుకొని.. ఆయన ఆసుపత్రి బిల్లును కడుతున్నామనే ప్రచారం ఏం బాగులేదు. ఇది శాస్త్రిగారిని అవమానించడమేనని.. ఆయన అభిమానులు భావిస్తున్నారు.