డేంజర్ : తొలి ఒమిక్రాన్ మరణం
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. సోమవారం ఒమిక్రాన్ తొలి మరణం నమోదైంది. యూకేలో వేరియంట్ సోకినవారిలో ఓ వ్యక్తి మృతిచెందినట్టు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ధ్రువీకరించారు. ఆదివారం ఒక్కరోజే యూకేలో 1239 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా.. అక్కడ దాదాపు 3100కు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ప్రతి రెండు మూడు రోజులకు అక్కడ కొత్త వేరియంట్ కేసులు రెట్టింపు అవుతుండటం ఆందోళన కలిగిస్తుంది.
నవంబర్ 27న యూకేలో ఒమిక్రాన్ కేసు తొలిసారి వెలుగుచూసింది. దీంతో బోరిస్ జాన్సన్ పలు కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నారు. అలాగే, ఆదివారం ఆయన ఈ వేరియంట్ సోకకుండా రక్షణ కొరకు బూస్టర్ డోసు వేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీంతో బూస్టర్ డోసు కోసం వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున జనం బారులు తీరుతున్నారు.