జనసేనలోకి మాజీ క్రికెటర్
వచ్చే సాధారణ ఎన్నికల కోసం ‘జనసేన పార్టీ’ పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతోంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనని పూర్తి చేశాడు. త్వరలోనే విజయవాడ పర్యటనని మొదలెట్టారు. ఎన్నికల సమయాన జనసేనలోకి భారీ వలసలు ఉంటాయని చెబుతున్నారు. మంత్రి గంటా శ్రీనివాస్ లాంటోళ్లు కూడా జనసేన వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు జనసేన తీర్థం పుచ్చుకోనున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజాగా, మాజీ క్రికెటర్ వేణుగోపాలరావు జనసేనలో చేరారు.
విశాఖలో జనసేన అధినేత పవన్ సమక్షంలో వేణుగోపాలరావు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సంద్దర్భంగా పవన్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ సుదీర్ఘ కాలం ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా పని చేస్తోంది. 2019లో జనసేన కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక, వేణుగోపాలరావు భారత్ తరపున 2005లో ఆరంగ్రేటం చేశారు. శ్రీలంకతో తొలి వన్డే, 2006లో వెస్టిండీస్‌పై చివరి వన్డే ఆడారు. 16 మ్యాచ్‌ల్లో 218 పరుగులు చేశారు.