‘భీమ్లా నాయక్’ వాయిదా.. నెల రోజుల శ్రమ !

ఫైనల్ గా సంక్రాంతి రేసు నుంచి ‘భీమ్లా నాయక్’ తప్పుకున్నాడు. జనవరి 12 నుంచి ఫిబ్రవరి 25కి షిష్ట్ అయ్యాడు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. దీంతో.. ఇండస్ట్రీ హ్యాపీ. రాజమౌళి, ప్రభాస్ ఇంకా హ్యాపీ. అయితే పవన్ అభిమానులు మాత్రం అన్ హ్యాపీ. సంక్రాంతిపై బోలేడు ఆశలు పెట్టుకున్నారు. తగ్గేదేలే.. అన్నారు. నిన్నటి వరకు భీమ్లా నాయక్ జనవరి 12నే అంటూ సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే చేశారు. కానీ వాళ్లు ఓడిపోక తప్పలేదు.

వాస్తవానికి పవన్ కు తగ్గాలని లేదు. దాదాపు నెల రోజుల నుంచే భీమ్లా నాయక్ వాయిదాపై ఆయనకు వినతులు వస్తున్నాయి. పవన్ కలవడానికి సినీ ప్రముఖులు, మాట్లాడటానికి రాజమౌళి లాంటోళ్లు ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన ఎవరికి అవకాశం ఇవ్వలేదు. దీంతో త్రివిక్రమ్ నుంచి నరుక్కుంటూ వచ్చారు. త్రివిక్రమ్ మాట పవన్ కాదనడు అని వారికి తెలుసు. ఫైనల్ అదే జరిగింది. తెలుగు నుంచి వస్తున్న రెండు పాన్ ఇండియా సినిమాల కోసం పవన్ తగ్గాడు. భీమ్లా నాయక్ వాయిదాకు అంగీకారం తెలిపారు. 

ఇక భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25కి వెళ్లడంతో.. ఆ డేటును ఇప్పటికే బుక్ చేసుకున్న ‘ఎఫ్ 3’ ఎప్రిల్ 29కి వెళ్లింది. ఇక భీమ్లా నాయక్ వాయిదాతో మిగిలిన సినిమాల రిలీజ్ డేట్స్ అన్నీ మారనున్నాయి. ఇక సంక్రాంతి రేసులో ఉన్న ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్ ఇండియన్ సినిమాని శాసిస్తాయని చెబుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ కోసం అదే ఆసక్తి నెలకొంది.