భైరవదీపం టు అఖండ

ప్రముఖ కామెడీ స్టార్ ఆలీ బుల్లి తెరపై  ‘ఆలీతో సరదాగా’ అనే షో కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా  ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన తమన్‌ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తొలిసారి ‘భైరవదీపం’ చిత్రానికి పనిచేశానని, ఇప్పుడు ‘అఖండ’కి పనిచేయడం ఆనందంగా ఉందని బాలకృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.ఆయన పని పరాజయంపాలైనా, విజయం అందుకున్నా ఒకేలా స్వీకరిస్తానని, రెండిటి నుంచీ ఏదో ఒకటి నేర్చుకుంటానని  అన్నారు. కావాలని ఎవరూ ఫ్లాప్‌ సినిమాలు చేయరని తెలిపారు.

తమన్  ఆరో తరగతి వరకే చదువుకున్నాడట. అప్పుడు చదివింది ఏదీ ఇప్పుడు ఉపయోగపడటంలేదని చెప్పుకొచ్చారు. చెన్నైలో ఉన్నప్పుడు పోస్టర్లు చూసి తమిళం, తెలుగు, ఇంగ్లిష్‌ మాట్లాడటం నేర్చుకున్నానని, హెడ్‌ మాస్టర్‌లాంటి త్రివిక్రమ్‌ పరిచయమయ్యాక తెలుగు రాయడం నేర్చుకుంటున్నానని వివరించారు. ఇళయరాజా, ఎ. ఆర్‌. రెహమాన్‌ సంగీతంలో తనకు స్ఫూర్తి అని తెలిపారు. తన సతీమణి చాలా ప్రతిభావంతురాలని, దాంతో ఇంట్లోనే తనపై ట్రోలింగ్‌ అయిపోతుందన్నారు. ఈ కారణంగానే బయట వచ్చే ట్రోల్స్‌ని పట్టించుకోనని చెప్పుకొచ్చారు.  అనంతరం, తన తండ్రి మరణాన్ని తలచుకుని బాధ పడ్డారు.