సీఎం కేసీఆర్ కు ఏపీ మంత్రి గిఫ్ట్…!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకుని మొక్కు తీర్చుకున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ విజయవాడ ఎయిర్ పోర్టు చేరుకున్నప్పటి నుంచి దర్శనం, పూజలు, హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యే వరకు ఏపీ మంత్రి దేవినేని ఉమ అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ఈ సందర్బంలో వీరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.
ఉమ్మడి రాష్ట్రంలో తాను రవాణా మంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ బస్టాండ్ నిర్మించామని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. ఆసియాలోనే పెద్ద బస్టాండ్‌గా ఉండాలని అప్పట్లో ఎన్టీఆర్ అన్నారని జ్ఞాపకం చేశారు. బస్టాండ్ పనులను పరిశీలిందుకే అనేక సార్లు విజయవాడ వచ్చేవాడినని దేవినేని ఉమకు వెల్లడించారు. దుర్గగుడి బాగా మారిపోయిందని,దుర్గగుడి ఘాట్ లను ఎప్పుడు అభివృద్ధి చేశారంటూ కేసీఆర్ మంత్రిని అడిగారు. పుష్కరాల సమయంలోనే అభివృద్ధి చేశామని దేవినేని ఉమ బదులిచ్చారు. కొండపల్లి, ఇబ్రహీంపట్నంతో పాటు పవిత్రసంగమం తన నియోజకవర్గంలోనే ఉందని కేసీఆర్ కు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమ కేసీఆర్‌కు కొండపల్లి బొమ్మను బహూకరించారు.