టీఆర్ఎస్ ముందస్తు శంఖారావం..!?
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై సవాల్ విసరడంతో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార పక్షంతో పాటు విపక్షాలు కూడా పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో హైకోర్టు తీర్పు ఆ ఎన్నికలకు బ్రేక్ వేసింది. దీంతో కేసీఆర్ ముందస్తు ప్రకటనలకు పంచాయితీ ఎన్నికల వాయిదా మరింత బలాన్ని చేకూర్చింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమంటూ అటు కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇతర పార్టీలు ఢంకా బజాయించి చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గద్వాలలో శుక్రవారం సీఎం పర్యటనపై అటు విపక్షాలు, ఇటు రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గద్వాల వేదికగా అధికార పార్టీ ముందస్తు శంఖారావాన్ని పూరిస్తుందనే టాక్ రాష్ట్రంలో మొదలైంది. అదీగాక కేసీఆర్ ముందస్తు వ్యాఖ్యల తరువాత జరుగుతున్న మొట్టమొదటి బహిరంగ సభకావడంతో అందరి చూపు ఆ సభవైపే ఉన్నాయి. సీఎం కేసీఆర్ ఏం మాట్లాడతారు, ఎలాంటి ప్రకటనలు చేస్తారు, సభలో ఎన్నికల హామీలను ప్రస్తావిస్తారనే ఆసకక్తి అందరిలోనూ నెలకొంది.
డీ.కె అరుణ కంచు కోట అయిన గద్వాలలో సభ నిర్వహించడం ద్వారా అధికార పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపడంతో పాటు రాబోయే ఎన్నికలకు సిద్ధం చేస్తోంది అధికార పార్టీ. విపక్ష కాంగ్రెస్ శ్రేణులకు సవాల్ విసురుతూ ఎన్నికల యుద్ధానికి సిద్ధమనే సంకేతాలను గద్వాల సభ పంపుతుందంటున్నారు విశ్లేషకులు. ఇది ముందస్తుకు శంఖారావంగా చెప్పుకుంటున్నారు చాలామంది. సభలో కేసీఆర్ ప్రసంగాన్ని బట్టి రాజకీయ పరిణామలు మరింత మారే అవకాశం కనిపిస్తోంది.