కాంగ్రెస్ క‌స‌ర‌త్తు షురూ..!!

తెలంగాణ‌లో ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైంది. సీఎం కేసీఆర్ ముంద‌స్తు స‌వాల్ తో వేడెక్కిన రాజ‌కీయం అధికార‌, విప‌క్ష పార్టీల‌ను ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌య్యేలా చేస్తోంది. అధికార పార్టీ గ‌ద్వాల‌లో బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేసిన నేప‌థ్యంలో తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్ష పార్టీలు మ‌రింత అప్ర‌మ‌త్త‌మ‌వుతున్నాయి. విప‌క్ష కాంగ్రెస్ కూడా ఎన్నిక‌ల క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేసింది.

ఆదివారం కాంగ్రెస్ జిల్లా అధ్య‌క్షులు, 119 నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జిల‌తో స‌మావేశం ఏర్పాటు చేస్తోంది టీపీసీసీ. ఈ స‌మావేశానికి ఏఐసీసీ ఇంచార్జి కుంతియా, ముగ్గురు కార్య‌ద‌ర్శులు హాజ‌ర‌వుతారు. పార్ల‌మెంట్ నియోజ‌క‌క‌వ‌ర్గ ఇంచార్జిల‌కు కూడా ఈ స‌మావేశానికి ఆహ్వానం అందింది. ఎన్నిక‌ల‌కు ఏవిధంగా సిద్ధ‌మ‌వ‌వ్వాలి, నియోజ‌వ‌ర్గాల్లో ప్ర‌స్తుత ప‌రిస్థితి, భ‌విష్య‌త్ లో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై ఈ స‌మావేశంలో కీల‌కంగా చ‌ర్చించ‌నున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి ప్ర‌ణాళిక‌తో ముదుకెళ్లాలి, ఎక్క‌డెక్క‌డ స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హిస్తే బాగుంటుంద‌నే అంశాల‌పై స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకోనుంది టీపీసీసీ. మొత్తంమీద కాంగ్రెస్ ఎన్నిక‌ల క‌స‌ర‌త్తు షురూ చేసింద‌ని భావించ‌వ‌చ్చు.