అసలేంటీ జీవో నెం.317 ?
రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు పేరుతో చేపడుతున్న ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియపై గందరగోళం నెలకొంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.317 ప్రకారం ఉమ్మడి జిల్లాలో సర్వీస్ సీనియారిటీని పరిగణనలోకి తీసుకొని ఉపాధ్యాయుల్ని బదలాయిస్తారు. స్థానికేతర కోటాలో నియామకం జరిగినా సీనియారిటీ ప్రకారం అదే జిల్లాలో ఉండవచ్చు. స్థానికుడైనా జూనియర్ అయితే కొత్త జిల్లాకు వెళ్లాల్సి ఉంది. సాధారణ బదిలీలు అయితే కొద్దికాలం తరువాత అయినా తిరిగి సొంత ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది. వీటిల్లో మళ్లీ తిరిగి వచ్చే అవకాశం లేదు.
దీనిపై జూనియర్ టీచర్లు సొంత జిల్లా వదిలి వెళ్లాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. స్థానికతనే ప్రామాణికంగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల ఉపాధ్యాయులు ఆందోళనకు దిగుతున్నారు. వారికి మద్దతుగా తెలంగాణ బీజేపీ నిలిచింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆందోళన చేయగా.. ఆయన్ని అరెస్ట్ చేసిన ప్రభుత్వం కోర్టులో హాజరుపరిచింది. ఆయనకు కోర్టు 14రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది.