వినాశకాలే విపరీత బుద్ధి
సీఎం కేసీఆర్ ను కేంద్రం అతి త్వరలోనే టచ్ చేయనుంది. ఆయన్ని జైలుకి పంపనుంది అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటుగా ఎంపీ అరవింద్, రఘునందన్ రావు.. రాజాసింగ్ ప్రతి ఒక్కరు.. ఇదే పాట పాడారు. కానీ కేంద్రం తనని టచ్ చేయకముందే కేసీఆర్.. బండి సంజయ్ ని టచ్ చేశారు. జీ.వో 317 కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న సంజయ్ ని నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14రోజుల రిమాండ్ ని విధించింది. దీనిపై బీజేపీ అధిష్టానం స్పందించింది. బండి సంజయ్‌ని అరెస్టు చేసిన తీరు దారుణంగా ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.
తలుపులు పగులగొట్టి, భౌతికంగా దాడి చేశారని ఆరోపించారు. సొంత కార్యాలయంలో దీక్ష చేస్తున్నా.. సాకులతో అరెస్టు చేశారని మండిపడ్డారు. బండి సంజయ్ అరెస్టు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేననన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అనేలా కేసీఆర్ సర్కార్ వ్యవహరిస్తోందన్నారు. ఉపాధ్యాయుల తరఫున భాజపా పోరాటం కొనసాగుతుందని నడ్డా వెల్లడించారు. సత్యం కోసం పోరాడతాం.. కేసీఆర్‌ను ఓడిస్తామన్నారు. ఇక్కడ వినాశకాలే విపరీత బుద్ధి అనే పదం నడ్డా వాడటం హాట్ టాపిక్ గా మారింది. కేంద్రం కూడా కేసీఆర్ ను టచ్ చేసే ప్లాన్ లో ఉంది. అతి త్వరలోనే ఆయనపై ఐటీ, ఈడీ దాడులు జరగొచ్చని అంచనా చేస్తున్నరు.