టాలీవుడ్ పెద్దగా ఆర్జీవీ.. పోరాటం షురు !

టాలీవుడ్ కు పెద్ద దిక్కు లేకుండా పోయింది. దర్శకరత్న దాసరి నారాయణ రావు ఉన్నప్పుడు అంతా తానై చూసుకునేవాడు. ఏ చిన్ని సమస్య వచ్చినా.. స్పందించేవారు. పరిష్కరించేవారు. ఆ స్థానంలో మెగాస్టార్ చిరంజీవి ఉండాలని టాలీవుడ్ కోరుకుంది. కానీ అందుకు చిరు నో చెప్పేశారు. పెద్దగా ఉండటం తన వల్ల కాదని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ స్థానంలో డైలాగ్ కింగ్ మోహన్ బాపు వస్తారనే వార్తలు వినిపించాయి. ఇంతలో టాలీవుడ్ పెద్దగా మా గురువుగారు రామ్ గోపాల్ వర్మ ఉండాలని.. ఆయన శిష్యుడు, దర్శకుడు అజయ్ భూపతి ట్వీట్ చేశారు. అందుకే ఓకే అన్నట్టుగా ఆర్జీవీ ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారాన్ని టేకప్ చేశారు. పోరాటం షురు చేశారు.

తాజాగా వర్మ ఏపీ మంత్రి పేర్ని నానికి సవాల్‌ విసిరారు. “సినిమా ఎంతో కష్టపడి ఓ నిర్మాత తీస్తే.. దానికి ప్రభుత్వం ఎలా రేటు ఫిక్స్‌ చేస్తుంది. పేదలు కష్టాల్లో ఉన్నప్పుడు… రేషన్‌, పంచదార, కిరోసిన్‌ తక్కువ ధరకు ఇస్తుంది. కానీ ఆ సూత్రాన్ని సినిమా టికెట్లకు అమలు చేయడం ఎంత వరకు సమంజసం సారూ. కాబట్టి… టికెట్ల ధరలలో ఆంధ్ర ప్రదేవ్‌ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం చాలా తప్పు. ఆడమ్ స్మిత్ ఆర్థిక సూత్రాల ప్రకారం… ప్రైవేట్‌ సంస్థల ఉత్పత్తులపై ధరలు నిర్ణయించే హక్కు ఏ ప్రభుత్వాలకు లేవు. సినిమా టికెట్ల విషయంలోనూ ఇంతే ” అంటూ పేర్ని నానిపై ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు వర్మ.