వావ్.. 1990 నుంచే ‘సంజు’ ప్రమోషన్

రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవిత కథ ‘సంజు’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి షోతోనే సంజయ్ దత్ జీవితం తెరపై సూపర్ హిట్ అని తేలిపోయింది. సంజయ్ పాత్రలో యంగ్ హీరో రణ్ బీర్ కపూర్ ఒదిగిపోయిన విధానంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తెరపై కనిపించేది నిజంగా సంజయ్ దత్ అనే భావన కలిగేలా రణ్ బీర్ నటన ఉందని మెచ్చుకొంటున్నారు.

సంజయ్ దత్ జీవితకథ కావడం. దాన్ని దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ డీల్ చేయడంతో ‘సంజు’కు పెద్దగా ప్రమోషన్ అవసరం పడలేదు. ఐతే, ‘సంజు’ ప్రమోషన్స్ ఇప్పుడు కాదు… 1990లోనే ప్రారంభించారని ఓ ఆసక్తికరమైన ట్విట్ చేశాడు. 1993 ముంబై పేలుళ్ల సమయంలో అరెస్టైన సంజయ్‌ దత్‌కు
బాలీవుడ్ మొత్తం అండగా నిలిచిన సంగతి తెలిసిందే.

అప్పట్లో ‘సంజు వీ ఆర్‌ విత్‌ యూ’ (సంజు మేము నీతో ఉన్నాం) అనే పోస్టర్‌తో సల్మాన్‌ ఖాన్‌, అజయ్‌ దేవగణ్‌, అక్షయ్‌ కుమార్‌, సైఫ్‌ అలీఖాన్‌లు నిల్చుని ఉన్న పాత ఫొటోను రిషి కపూర్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. దీనికి ‘బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న రణ్‌బీర్‌ ‘సంజు’ సినిమాను ప్రమోట్‌ చేసేందుకు కష్టపడాల్సిన అవసరం లేదోమో’ అంటూ కామెంట్ పెట్టారు.

ఇప్పుడీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 1990లోనే స్టార్ హీరోలు ప్రమోట్ చేసిన ‘సంజు’ ఇప్పుడు బాలీవుడ్ రికార్డులన్నీ బ్రేక్ చేయడం గ్యారెంటీ అనే కామెంట్స్ వినబడుతున్నాయి. ఇప్పటికే ‘సంజు’ కలెక్షన్స్ సునామీ ప్రారంభమైంది. ఈ సునామీలో ఎన్ని రికార్డులు వచ్చి చేరుతాయన్నది చూడాలి.