నేరం ఒప్పుకున్న వనమా రాఘవ.. 12 కేసులు నమోదు !

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈ నెల 3న రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న కేసులో ఎమ్మెల్యే వనమా కొడుకు వనమా రాఘవ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం ఏఎస్పీ రోహిత్ రాజ్‌ మీడియాకు వివరించారు.

“భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈ నెల 3న రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. భార్య, ఇద్దరు కుమార్తెలపై పెట్రోల్‌ పోసి తానూ నిప్పంటించుకున్నారు. ఘటనాస్థలిలో రామకృష్ణ, శ్రీలక్ష్మి, సాహిత్య చనిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పెద్దకుమార్తె సాహితీ మృతిచెందింది. ఈ నెల 3న రామకృష్ణ బావమరిది జనార్దన్‌ ఫిర్యాదుతో పాల్వంచ పీఎస్‌లో కేసు నమోదు చేశాం. ఐపీసీ 302, 307, 306 సెక్షన్ల కింద కేసు పెట్టాం.

ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. సూసైడ్ నోట్‌, సెల్ఫీ వీడియోలో వనమా రాఘవపై ఆరోపణలు చేశారు. ఆర్థిక ఇబ్బందులే కాకుండా ఇతర కారణాలు ఉన్నాయని వీడియోలో చెప్పారు. రాఘవ, సూర్యవతి, మాధవి కారణంగానే చనిపోతున్నట్లు తెలిపారు. నిందితుల కోసం 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. నిన్న రాత్రి వనమా రాఘవను అదుపులోకి తీసుకున్నాం. దమ్మపేట మండలం మందలపల్లి వద్ద రాఘవను అరెస్టు చేశాం. పలు అంశాలపై రాఘవను విచారించాం. రామకృష్ణను బెదిరించినట్లు రాఘవ అంగీకరించారు. లభ్యమైన ఆధారాలను సీజ్‌ చేసి కోర్టుకు సమర్పించాం. నిందితులను ఇవాళ కొత్తగూడెం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తాం. రాఘవపై మొత్తం 12కేసులు ఉన్నాయి. గతంలో నమోదైన కేసులపై కూడా విచారణ జరుపుతాం. కేసు దర్యాప్తు దశలో ఉన్నందున పూర్తి వివరాలు వెల్లడించలేం” అని ఏఎస్పీ రోహిత్‌ రాజ్‌ చెప్పారు.