మరో బీజేపీ మంత్రి రాజీనామా
యూపీ బీజేపీకి మరో షాక్. మరో మంత్రి రిజైన్ చేశారు. నిన్న మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామా చేయగా… ఈ రోజు యూపీ అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న ధారా సింగ్ చౌహాన్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. మధుబన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దళితులు, వెనుకబడిన తరగతులు, రైతులు, నిరుద్యోగుల పట్ల యోగీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటమే తన రాజీనామాకు కారణమని ధారాసింగ్ చెప్పారు. బీజేపీకి గుడ్ బై చెప్పిన వెంటనే దారా సింగ్ చౌహాన్ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ను కలిశారు. సమాజ్ వాదీ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
దారాసింగ్ చౌహాన్.. గతంలో బీఎస్పీలో ఉన్నారు. ఆ పార్టీ తరపున రెండు సార్లు రాజ్యసభ, ఒకసారి లోక్సభకు ఎన్నికయ్యారు. ఓబీసీ సామాజికవర్గానికి చెందిన దారాసింగ్ చౌహాన్ 2015 ఫిబ్రవరిలో బీజేపీలో చేరారు. అదే ఏడాది పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడయ్యారు. గత రెండ్రోజులుగా యూపీలో ఆరుగురు బీజేపీ నేతలు పార్టీని వీడారు. వీరిలో స్వామి ప్రసాద్ మౌర్య, ధారా సింగ్ చౌహాన్ మంత్రులు కాగా… రోషన్ లాల్ వర్మ, బ్రిజేష్ ప్రజాపతి, భగవతి సాగర్, వినయ్ శక్యాలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మరోవైపు నిన్న బీజేపీని వీడిన మంత్రి ప్రసాద్ మౌర్యకు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. 2014లో స్వామి ప్రసాద్ మౌర్య హిందూ దేవుళ్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో మౌర్యకు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.