రెండో డోసు 70 శాతం పూర్తి

దేశంలో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా పరిస్థితుల గురించి వారితో చర్చించారు. వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతుల గురించి తెలుసుకున్న మోదీ.. వైరస్‌ కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభించి ఏడాది పూర్తి కావొస్తోందని తెలిపారు. పదిరోజుల్లోనే 3కోట్ల మంది టీనేజర్లకు కొవిడ్‌ టీకా పూర్తి చేసినట్లు చెప్పారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, వృద్ధులకు ప్రికాషన్‌ డోస్‌ ఇస్తున్నామని తెలిపారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ టీకాల కార్యక్రమం నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు దేశంలో రెండో డోసు వ్యాక్సినేషన్‌ 70శాతం పూర్తయిందని ప్రధాని వివరించారు. తెంగాణ రాష్ట్రం నుంచి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.