రోడ్‌షోలపై నిషేధం పొడిగింపు

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో రోడ్‌షోలు, పాదయాత్రలు, సైకిల్‌/బైక్‌ ర్యాలీలపై ఇదివరకే విధించిన నిషేధాన్ని పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. ఈ నెల 8న ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ని ప్రకటించిన సందర్భంగా ఎన్నికల ర్యాలీలపై విధించిన నిషేధం నేటితో ముగియనుండటంతో.. నిషేధాన్ని ఈ నెల 22 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇండోర్‌లలో నిర్వహించే సమావేశాలకు 300 మంది/ హాలులో 50శాతం సామర్థ్యానికి మించకుండా చూసుకోవాలని రాజకీయ పార్టీలకు సూచించింది.

ప్రస్తుతం యూపీలో 84,440 క్రియాశీల కేసులు ఉండగా.. ఉత్తరాఖండ్‌లో 12,349, పంజాబ్‌లో 34,303, గోవాలో 18,597, మణిపూర్‌లో 944 చొప్పున కొవిడ్‌ రోగులు ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవా, మణిపుర్‌లలో మొత్తం 690 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపును మార్చి 10న ఒకేసారి జరగనుంది.