కాంగ్రెస్ లో చేరిక‌కు రంగం సిద్ధం..!!

రాష్ట్ర విభ‌జ‌న‌ను వ్య‌తిరేకిస్తూ స‌మైక్యాంద్ర నినాదంతో కాంగ్రెస్ పార్టీని వీడిన మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు కాంగ్రెస్ ముఖ్య నేత‌లు కిర‌ణ్ తో ట‌చ్ లోకి వ‌చ్చి ప‌లు ద‌ఫాలుగా చ‌ర్చ‌లు జ‌రిపారు. ఏపీలో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న సేవ‌లు పార్టీకి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతాయ‌ని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. రాహుల్ నుంచి కూడా గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డంతో కిరణ్ చేరిక వీలైనంత త్వ‌ర‌గా జ‌రిగేందుకు ఏర్పాట్లు చ‌క‌చ‌కా జ‌రుగుతున్నాయి.

తాజాగా ఆదివారం కిర‌ణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ ఏపీ వ్య‌వ‌హారాల ఇంచార్జి ఉమెన్ చాందీ ఆయ‌న నివాసంలో క‌లిసారు. పార్టీలోకి ఆహ్వానించారు. ఈ వారంలోనే ఆయ‌న కాంగ్రెస్ లో చేరే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ అంశంపై ఏపీ కాంగ్రెస్ నేత‌లతో స‌మావేశ‌మ‌య్యారు ఉమెన్ చాందీ. వారి అభిప్రాయాల‌ను, పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి ఏం చేయాల‌నే అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. కిర‌ణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరిన అనంత‌రం ఆయ‌న‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మొత్తంమీద మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక‌కు రంగం సిద్ధమైంది.ఆయ‌న చేరిక‌తో కాంగ్రెస్ కు ఏపీలో పూర్వ వైభ‌వం వ‌స్తుందో లేదో చూడాలి మ‌రి.