ఆ ఒక్కటి చాలు..అవసరమైతే పోటీకి దూరంగా ఉంటా..!!
పీసీసీ రేసులో తానున్నానంటూ ముందుండే నల్గొండ కాంగ్రెస్ లీడర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి తన కోరికను వెలిబుచ్చారు. పార్టీ అధిష్టానం ఆదేశాల ప్రకారం తాను పోటీ చేస్తానని, ఎంపీగా పోటీ చేయాలని ఆదేశిస్తే తాను సిద్ధమేనని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. తమ మధ్య గ్రూపు తగాదాలు పెద్ద సమస్య ఏమీ కాబోవని, ఉత్తమ్, జానారెడ్డితో తాము ఇప్పటికే కలిసికట్టుగా పనిచేస్తున్నామన్నారాయన. సీఎం కేసీఆర్ కు కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ డిండి ఎత్తిపోతలపై ఎందుకు లేదని ప్రశ్నించారు.
నల్గొండలో సీఎం కేసీఆర్ తో సహా ఆయన కుటుంబ సభ్యులు ఎవరుపోటీచేసినా గెలిచేది కాంగ్రెసే అన్నారు. చైతన్యవంతమైన నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ పప్పులుడకవన్నారు. మునుగోడు, భువనగిరి అసెంబ్లీ స్థానాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, బలమైన అభ్యర్థులనే రంగంలోకిదింపేలా ఆలోచించాలన్నారు కోమటిరెడ్డి. పీసీసీ చీఫ్ గా అవకాశం ఇస్తే పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తానని, అవసరమైతే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల పోటీకి కూడా దూరంగా ఉండి రాష్ట్రమంతా పర్యటిస్తానని మీడియాలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. జీవితాంతం పార్టీ కోసమే సేవ చేస్తానని చెప్పారాయన. నల్గొండ జిల్లాపై సీఎం వివక్ష చూపుతున్నారని, ఉమ్మడి జిల్లాలో అన్నిస్థానాలు కాంగ్రెస్ పార్టీవేనని జోస్యం చెప్పారు.