ఇకపై ‘ఒకే డిజిటల్‌ ఐడీ’.. కసరత్తు చేస్తున్న కేంద్రం !

ప్రస్తుతం దేశ పౌరులు వివిధ అవసరాల కోసం ఆధార్‌, ఓటరు గుర్తింపు, పాన్‌ కార్డు, పాస్‌పోర్టు వంటివాటిని ప్రభుత్వ గుర్తింపు కార్డులుగా వాడుతున్నారు. వీటన్నింటిని అనుసంధానం చేస్తూ కొత్తగా ‘ఒకే డిజిటల్‌ ఐడీ’ని రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. డిజిటల్‌ గుర్తింపు పత్రాల సమాకలనం (ఫెడరేటెడ్‌ డిజిటల్‌ ఐడెంటిటీస్‌)గా ఈ కొత్త మోడల్‌ను రూపొందించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ ఓ ప్రతిపాదన తయారు చేసినట్లు సమాచారం.

కేంద్రం కొత్త ప్రతిపాదనలో భాగంగా ఆధార్‌ కార్డు నంబరు మాదిరిగా దీనికీ ఓ విశిష్ట గుర్తింపు సంఖ్య ఉండొచ్చని అంటున్నారు. ఏ కార్డు అవసరమైతే ఆ కార్డును అప్పటికప్పుడు వినియోగించుకోవడానికి వీలుగా ఈ ప్రతిపాదనను రూపొందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఐడీల సమాచారం మొత్తాన్ని ఒకేచోట ఉంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఈ ప్రతిపాదన ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. పూర్తి అధ్యయనం, రక్షణ చర్యలు తీసుకున్న తర్వాతే అమల్లోకి వస్తుందని చెబుతున్నారు.