‘కేంద్ర బడ్జెట్‌ 2022’లోని కీలక అంశాలు

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం లోక్‌సభలో 2022-23 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. భారత్ 75 ఏళ్ల అమృత మహోత్సహాన్ని జరుపు కుంటుందని, వచ్చే 25 ఏళ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్ పునాదని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ముఖ్యంగా నాలుగు అంశాలపై.. ప్రధాని గతిశక్తి యోజన, సమీకృత అభివృద్ధి, అభివృద్ధి ఆదారిత పెట్టుబడులు, పరిశ్రమలకు ఆర్థిక ఊతం లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిపారు.

రాబోయే మూడేళ్లలో మరో 400 వందే భారత్‌ రైళ్లను తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. మౌలిక వసతుల సదుపాయాల రంగంలో ముఖ్యమైన రైల్వేల్లో కీలక మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. అత్యాధునిక సదుపాయాలు, గంటకు 160 కిలోమీటర్ల కంటే వేగంతో దూసుకెళ్లే వందే భారత్‌ రైళ్లను మరిన్ని తేవాలని నిర్ణయించింది. ఇప్పటికే 100 రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ సన్నద్ధం కాగా.. రాబోయే మూడేళ్లలో వాటి సంఖ్య 400కి పెంచాలని నిర్ణయించింది.

 ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు 12 టెలివిజన్‌ ఛానళ్లు ఉండగా.. వీటిని 200 ఛానళ్లకు పెంచుతున్నాం. ఒక్కో తరగతికి ఒక్కో ఛానల్‌ ఏర్పాటు చేయడంతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ టీవీల్లో తరగతుల బోధన చేపట్టనున్నామని నిర్మలమ్మ చెప్పారు. ప్రధాని ఈ-విద్య కార్యక్రమం ద్వారా అనుబంధ విద్య విధానాన్ని విస్తరిస్తాం అన్నారు.

పన్ను మినహాయింపుపై కేంద్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. వ్యక్తిగత ఆదాయ పన్ను టారిఫ్‌లపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ ప్రసంగంలో వివరాలు వెల్లడించలేదు. దీంతో వేతన జీవులు బడ్జెట్‌పై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాలకు ఆర్థిక సాయంగా రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. దీని ద్వారా రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు చెప్పారు.

ముఖ్యంగా డిజిటల్‌ కరెన్సీల ద్వారా ఆదాయం, ఆస్తుల బదిలీపై ఈ 30శాతం పన్ను ఉంటుందని స్పష్టం చేశారు. డిజిటల్‌ కరెన్సీతో జరిగే ఆస్తుల బదిలీపై ఒక శాతం టీడీఎస్‌ ఉంటుందని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌ వేళ.. వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు ఉపశమనం కలిగింది. చమురు సంస్థలు 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.91.5 తగ్గించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

 ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయరంగానికి ఊతం ఇచ్చేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాజా బడ్జెట్‌లో కొన్ని కీలక ప్రకటనలు చేశారు. వరి- గోధుమ కొనుగోళ్లు, మద్దతు ధరల కోసం రూ.2.37లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. దేశాన్ని ‘డిజిటల్‌ ఇండియా’గా తీర్చిదిద్దేందుకు ఈసారి బడ్జెట్‌ (Union Budget 2022)లో సాంకేతికతపై ప్రత్యేక దృష్టిసారించింది కేంద్ర ప్రభుత్వం. ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా డిజిటల్‌ కరెన్సీని తీసుకురానుంది. ఈ ఏడాదిలోనే డిజిటల్‌ రూపీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ 2022-23 ప్రసంగంలో ప్రకటించారు.