దేవేగౌడ’లో ఇంతటి మార్పుకు కారణాలేంటో.. !?
మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవేగౌడ ఆదివారం హైదరాబాద్ వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్’ని కలిసిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ఫెడరల్ ఫ్రంట్, జాతీయ రాజకీయాలపై చర్చ జరిగింది. ఇటీవలే కర్ణాటకలో జేడీఎస్ కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేవేగౌడ కుమారుడు కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. ఐతే, ఆ సమయంలో దేవేగౌడ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాదని కామెంట్ చేశారు. ఇప్పుడున్న పరిస్తితుల్లో కాంగ్రెస్ లేకుండా ఫెడరల్ ఫ్రంట్ సాధ్యంకాదని తేల్చి చెప్పారు. అలాంటి దేవేగౌడ స్వయంగా వచ్చి కేసీఆర్’ని కలవడం.. ఫెడరల్ ఫ్రెంట్ పై చర్చించడం ప్రాధాన్యతని సంతరించుకొంది. దేవేగౌడ ఇంతటి మార్పునకు కారణలేంటన్న దానిపై రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది.
కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలో అప్పుడే గొడవలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి కుమార స్వామి, మాజీ ముఖ్యమంత్రి సిద్ది రామయ్యలకు అస్సలు పడటం లేదనే వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్న ముఖ్యమంత్రి కుమార స్వామి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనుమతి తీసుకోవాల్సి వస్తుంది. ఇది గమనించిన దేవేగౌడ కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలబడని ముందే ఊహించినట్టు కనబడుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ లేవనెత్తిన ఫెడరల్ ఫ్రంట్ లో కీలక భూమిక పోషించేలా సంకేతాలివ్వడం, తద్వారా కర్ణాటకలో కాంగ్రెస్ దూకుడుకు చెక్ పెట్టొచ్చు అనే ఎత్తుగడతో కేసీఆర్ ని కలిసినట్టు చెప్పవచ్చు.
ఇదీగాక, మొదటి నుంచి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబులో ఈ మధ్య మార్పొచ్చింది. వచ్చే ఎన్నికల్లో భాజాపాని దెబ్బకొట్టడమే లక్ష్యంగా పెట్టుకొన్న చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసి నడిచేందుకు అభ్యంతరం చెప్పడం లేదు. కుమార స్వామి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారకార్యక్రమంలో చంద్రబాబు రాహుల్ గాంధీ భుజం తట్టడం హైలైట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ, చంద్రబాబు సూచనతో దేవేగౌడ కేసీఆర్ ని కలిసి ఉంటాడు. కాంగ్రెస్ తో కలిపి ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు చేసే దిడగా కేసీఆర్ ఒప్పించే బాధ్యతని తీసుకొని ఉంటాడని చెప్పుకొంటున్నారు. ఈ ప్రపొజల్ కు కేసీఆర్ ఒప్పుకోకపోవచ్చు. తెలంగాణలో టీఆర్ ఎస్ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కావడమే ఇందుకు కారణం. మొత్తానికి.. దేవేగౌడ కేసీఆర్ ని కలవడం వెనక పెద్ద వ్యూహామే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.