అగ్రస్థానంలో తెలంగాణ

ఢిల్లీ కోటలు బద్దలు కొడతానని సీఎం కేసీఆర్‌ జనగామ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్‌ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామన్న తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాహసోపేత ప్రకటనపై గతంలో రాజకీయ ప్రత్యర్థులు ఎగతాళి చేశారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అదే తెలంగాణ నేడు కేసీఆర్‌ సారథ్యంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. 

తెలంగాణ సాధిస్తామన్న 2001 నాటి కేసీఆర్‌ ప్రకటన గుర్తు చేస్తూ మంత్రి కేటీఆర్‌ శనివారం ట్వీట్‌ చేశారు. ”మొదట నిన్ను పట్టించుకోరు.. ఆ తర్వాత నిన్ను చూసి నవ్వుతారు.. ఆపై నీతో గొడవ పడతారు.. చివరకి అంతిమ విజయం నీదే” అన్న గాంధీ మాటలను కేటీఆర్‌ తన ట్వీట్‌లో కోడ్ చేశారు. ఢిల్లీ గోడలు బద్దలు కొట్టడం ఖాయమని కేటీఆర్ తన ట్వీట్ తో స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసినట్టు అర్థమవుతుంది.