మరోసారి చైనాపై భారత్ డిజిటల్ స్ట్రయిక్
చైనా యాప్‌లపై మరోసారి కొరడా ఝళిపించేందుకు భారత్ రెడీ అవుతోన్నట్లు తెలుస్తోంది. దేశ భద్రత దృష్ట్యా చైనాకు చెందిన మరో 54 యాప్‌లపై నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బ్యూటీ కెమెరా – సెల్ఫీ కెమెరా, స్వీట్ సెల్ఫీ హెచ్‌డీ, వివా వీడియో ఎడిటర్, టెన్సెంట్ రివర్ , యాప్‌లాక్, డ్యుయల్ స్పేస్ లైట్ వంటి 54 యాప్‌లపై త్వరలోనే నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది.
2020 జూన్ 15న గల్వాన్ లోయ వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలతో పరిస్థితుల నేపథ్యంలో.. 2020 జులై నెలలో టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లను కేంద్రం నిషేధించింది. తర్వాత అదే ఏడాది సెప్టెంబరులో మరో 118 యాప్‌లు, నవంబరులో 43 చైనా యాప్‌లను నిషేధించింది. వీటిల్లో టిక్‌టాక్‌తో పాటు విచాట్, షేర్‌ఇట్, హలో, లైకీ, యూసీ బ్రౌజర్, పబ్‌జీ వంటి యాప్‌లున్నాయి.